Sambashana

Telugu News

PM MODI: నేడే తెలంగాణకు మోడీ.. బీసీ గర్జన సభలో ప్రధాని ప్రసంగం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ దూకుడు పెంచింది. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల కార్యక్రమం ముగిసిన తర్వాత మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

అయితే ఈరోజు (మంగళవారం) ఎల్బీ స్టేడియంలో బీసీ స్వాభిమాన్ పేరుతో బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈరోజు మోడీ మీటింగ్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఈరోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. 5:25 నుంచి 6:15 వరకు బీజేపీ నిర్వహిస్తున్న బీసీ గర్జన సభకు మోదీ హాజరుకానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం.

దీంతో పాటు ఈ సభకు లక్ష మందిని తీసుకురావాలని భాజపా రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల ప్రజలను తరలించేందుకు కమలం పార్టీ నేతలు సిద్ధమయ్యారు. అలాగే నేటి సమావేశం అనంతరం 11న పరేడ్ గ్రౌండ్‌లో జరిగే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.