Sambashana

Telugu News

Vizag: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారా… ఇకపై ఊచలు లెక్క బెట్టాల్సిందే ?

1 min read

Vizag: కడుపులో పడినప్పటి నుంచి భూమ్మీదకు వచ్చే వరకు తల్లి తన బిడ్డలను ఎంత నొప్పి అయినా భరిస్తూనే ఉంటుంది. ప్రసవం సమయంలో తాను మృత్యువు అంచులకు చేరుతానని తెలిసినా న ప్రాణం కంటే బిడ్డే ముఖ్యమని భావిస్తోంది. ఇక తండ్రి.. పసిపాపగా ఈ లోకంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన బాధ్యతలను భుజాలపై వేసుకుంటాడు. తన పిల్లలను పోషించుకోవడానికి అహర్నిశలూ కష్టపడుతున్నాడు. కానీ అడ్డాల నాడు బిడ్డలు కానీ, గడ్డాలా నాడా అన్నట్లుగా.. పెరిగి పెద్దై ప్రయోజకులయ్యాక తల్లిదండ్రులను భారంగా ఫీలవుతూ.. వారిని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒంటరిగా వదిలేయ్యడం, వృద్ధాశ్రమంలో పడేయడం ఒకటైతే.. వారి ఆస్తుల కోసం, నగలు, డబ్బు కోసం దాడి చేయడం, హింసించడం మరో కోణం.

ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. ఆస్తులు రాసిచ్చే వరకు ప్రేమించి ఇళ్ల నుంచి వెళ్లగొట్టి దాడులు చేస్తున్నారనే ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయి.. ముఖ్యంగా వైజాగ్ నగరంలో ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు అలాంటి పిల్లలకు (ముఖ్యంగా కొడుకులకు) కౌన్సెలింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు. తల్లిదండ్రులు, పెద్దలు తమ పిల్లలను సక్రమంగా చూసుకోకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఉన్న చట్టాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇకపై, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్, 2007 కింద అటువంటి పిల్లలపై కేసులు బుక్ చేయబడతాయి. సీనియర్ సిటిజన్ తన సొంత ఆదాయం లేదా ఆస్తిని కొనసాగించలేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

వివరాలు ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు పంపబడతాయి. ఫిర్యాదుదారుడు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థనతో ఆర్‌డిఓ నేతృత్వంలోని ట్రిబ్యునల్‌కు నివేదిక పంపాలని ఆదేశించారు. ఆరోపణలు నిజమని తేలితే 2007 చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. సీఆర్‌పీసీ నివేదికను కోర్టులో దాఖలు చేయనున్నారు. విచారణలో నిజం నిరూపితమైతే.. తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేసిన పిల్లలకు మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 5 వేల జరిమానా విధిస్తారు. గత రెండేళ్లలో విశాఖలో 7 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే సీపీ వాట్స్ నంబర్ 9493336633, పోలీస్ హెల్ప్‌లైన్ 112, నేషనల్ సీనియర్ సిటిజన్స్ హెల్ప్‌లైన్ నంబర్ 14567కు సమాచారం అందించాలని సీపీ తెలిపారు.